ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ఆదిలాబాద్‌: బేషరతుగా సమ్మె విరమించుకున్న ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన యూనియన్‌ జిల్లా కౌన్సెలింగ్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమ్మె విరమించిన కార్మికులను డ్యూటీలోకి తీసుకోకుండా కాలయాపన చేయడం సమజసం కాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. అలాగే రిమ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు సమానపనికి సమాన వేతనం అందించాలన్నారు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు.  అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, ఆశా, కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని నిలిపివేయాలన్నారు. వీఆర్‌ఎస్‌ పేరిట లక్షలాది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని మానుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా నాయకులు సిర్ర దేవేందర్, కుంటాల రాములు, రాజు, రఘునాథ్, ఉస్మాన్, నాందేవ్, ఆశన్న, కాంతరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.