"వినియోగదారుల రక్షణ చట్టం - 2019" ఆయుధం లాంటిది
వినియోగదారులు..

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

 

* జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి

 

*  "వినియోగదారుల రక్షణ చట్టం - 2019" ఆయుధం లాంటిది

 

కడప, డిసెంబర్ 26 : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకొని వ్యాపారంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని జిల్లా జాయింట్  కలెక్టర్ ఎం. గౌతమి తెలిపారు. గురువారం స్థానిక కాలెక్టరేట్ లోని స్పందన హాలులో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వారి అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఏడాది డిసెంబర్ 24వ తేదీన నిర్వహించుకోవాల్సిన కార్యక్రమాన్ని కొన్ని అధికారిక కారణాల వల్ల 26వ తేదీన జరుపుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం "వినియోగదారుల రక్షణ చట్టం - 2019" తీసుకువచ్చిందని 2020 సంవత్సర ఆరంభం నుండి అన్ని రాష్ట్రాల్లో ఈ నూతన చట్టం అమలవుతుందన్నారు. వినియోగదారులు తమ హక్కుల పట్ల ఎప్పటికప్పుడూ అవగాహన పెంచుకోవాలని  సూచించారు. వినియోగదారులు వ్యాపార రంగంలో ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటున్నారో కొన్ని అనుభవాలను జోడిస్తూ వివరించారు. చాలామంది చట్టాలపై అవగాహన వున్నా ఆచరణలో పెట్టకపోవడం వల్ల చాలా వరకు మోసపోతున్నారని, ఇది కేవలం వినియోగదారుడి నిర్లక్ష్యం వల్లే అన్నారు. ఇలాంటి చిన్న తప్పిదాలు తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారంటే.. అవగాహన లోపమే అన్నారు. అందుకే నూతనంగా ఆవిష్కృతమైన "వినియోగదారుల రక్షణ చట్టం - 2019" పై ఈరోజు మనం చర్చించుకుంటున్నామన్నారు. వినియోగదారుల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు శిరీషా రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం జిల్లా జడ్జి కోర్టుకంటే వినియోగదారుల చట్టం ముందు ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయంటే... వినియోగదారుల అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందన్నారు. చట్టం పరిధి రూ.20 లక్షలు నష్టపోతేనే.. చూసేవాళ్ళం. ప్రస్తుతం రూ.1 కోటి వరకు పరిధిని పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం బిజీగా మరిన సమాజంలో ఎక్కువ శాతం ఆన్ లైన్ షాపింగ్ చేయడం అలవాటయిపోయిందని,.. ఈ నేపథ్యంలో రూ.10 కోట్ల వరకు రాష్ట్ర స్థాయిలో ఫైల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆపై నష్టపోయిన వారు జాతీయ స్థాయిలో ఫిర్యాదులు ఫైల్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం వ్యాపారం విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలావరకు మోసం కూడా చొరబడుతోందని, ఇలాంటి సమయంలో వినియోగదారులుగా మనమే జాగ్రత్త పడాలి. మొదటగా బాధ్యతలను గుర్తుంచుకొని మీ హక్కును సాధించుకొని, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో మీడియా ప్రముఖ పాత్ర వహిస్తోందండని తెలిపారు. కావున మీడియా ద్వారా కూడా అవగాహన పెంచుకోవలన్నారు.  "ప్రతి వ్యాపారస్థునికీ వినియోగదారుడే దేవుడు" అని తెలిపారు.  ప్రతి ఒక్క సేవలోను మోసం అనేది జరుగుతుంది. ఎంతో మోజుతో కొన్న వస్తువు నాణ్యతను కోల్పోతే.. వినియోగదారుల క్షోభ వర్ణనాతీతం అని.. అందుకే వినియోగదారుల చట్టంపై అవగాహన పెంచుకొని, వస్తువు నాణ్యత, విలువలు తెలుసుకొని కొనుగోలు చేయాల్సి వుంటుంది. 

ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి మద్దిలేటి మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యాపారి వద్ద ఏదోక వస్తువు కొనాల్సిన అవసరం ఉంటుంది కావున.. మనం కొనే వస్తువు యొక్క స్థితిని  గమనించడం మన బాధ్యత అన్నారు. వస్తువు తయారీ తేదీ, గడువు ముగింపు తేదీ, వస్తువు నాణ్యత ప్రమాణాలు, రుచి, వాసన తదితర వస్తువు యొక్క స్థితిని గమనించాలని తెలిపారు. ఏమైనా తేడాలు గమనించినట్లయితే వెంటనే వినియోగదారుప ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చాన్నారు.  కడప రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్తక వ్యాపారాల్లో వినియోగ దారుడు చాలా విధాలుగా నష్టపోతున్నామని చెప్పవచ్చు. వినియోగదారులుగా మనం కొనే వస్తుపై మనకు పూర్తి స్థాయి హక్కు ఉందని తెలిపారు. కొనే వస్తువు ఖరీదును గమనించినట్లయితే ఎంఆర్ పి రేటుకంటే ఎక్కువ ధరకు వస్తువును విక్రయిస్తున్నారేమో గమనించాలన్నారు. ఎం ఆర్ పి రేటుకంటే అధిక ధరకు వస్తువును అమ్మితే వెంటనే  కన్స్యూమర్ ఫోరమ్ కు ఒక్క కాల్ చేస్తే.. వస్తువు అమ్మకంలో ఎలాంటి మోసాన్ని అయినా అరికట్టవచ్చన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.  అనంతరం జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ సిపి రమేష్ మాట్లాడుతూ.. పాల ప్యాకెట్లపై ముద్రించే డేట్ అనేది ప్యాకింగ్ చేసిన తేదీనా ? ఎస్ఫైరీ తేదీనా ? తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామని సంబంధిత జిల్లా అధికారులు దీనిపై దృస్థి సారించాలని సూచించారు.  అలాగే వంట గ్యాస్ సిలిండరును వినియోగించే విషయంలో కూడా జాగ్రత్త వహించాలన్నారు. వినియోగదారులు సాధారణ వస్తువులతో పాటు, ఆహార వస్తువుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు నిర్వహించాలని సూచించారు. మన హక్కులను కాపాడుకోవడం మన ప్రధాన బాధ్యత అని.. అందుకు సంభందించి పలు ఉదాహరణలతో అవగాహన కల్పించారు. అనంతరం వినియోగదారుల ఫోరమ్ తరపున విద్యార్థిని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థిని సురేఖ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  ఈ సందర్బంగా సురేఖ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పుట్టిన నాటి నుండే వినియోగదారులుగా మారిపోతున్నారని, ఆ లెక్కన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులే అని, గుర్తు చేస్తూ తన ప్రత్యక్ష అనుభవాలను జోడించి ప్రసంగించారు.  అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని హైస్కూళ్ళు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు రూ.1 లక్ష విలవ చేసే చెక్కులను, ప్రశంసా పత్రాలను బహుమానంగా  గౌరవాద్యక్షుల చేతుల మీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణా కలెక్టర్ శ్రీవాస్ నుపూర్,   జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సౌభాగ్య లక్ష్మీ, మేనేజర్ పద్మ, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి సుధాకర్, విజిలెన్స్ కమిటీ సభ్యులు మోటు నాగేశ్వరరావు, పౌర సరఫరాల డీలర్లు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.