*గోవాలో పర్యటించాల్సిందిగా ఆహ్వానం*
హైదరాబాద్, డిసెంబర్ 28 చాటింపు ప్రథినిది :మహారాష్ట్రలోని కొంకన్ బ్యాంబు అండ్ కేన్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, సెంటర్ ఫర్ ఇండియన్ బ్యాంబు రిసోర్స్ అండ్ టెక్నాలజీ ( సిబార్ట్ ) డైరెక్టర్ సంజీవ్ ఎస్ కార్పె నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో శనివారం ఆయన నివాసంలో భేటీ అయింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర, గోవా, కర్నాటక రాష్ట్రాల్లో చేస్తున్న బ్యాంబు సాగు విషయాలను తెలిపారు. కర్నాటక, గోవా సరిహద్దులోని కుడాల్ ప్రాంతంలో 15 వేల ఎకరాల్లో రైతులు బ్యాంబును సాగు చేస్తూ .. ఎకరానికి రూ. లక్ష ఆదాయాన్ని పొందుతున్నారని వారు వినోద్ కుమార్ కు వివరించారు. కుడాల్ బ్యాంబు క్షేత్రాన్ని పరిశీలించేందుకు గోవా పర్యటనకు రావాల్సిందిగా వారు వినోద్ కుమార్ ను ఆహ్వానించారు. అందుకు వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ బ్యాంబు సాగుకు వాతావరణం అనుకూలంగా ఉందని, ఇక్కడి రైతులు కూడా బ్యాంబు సాగుకు మొగ్గుచూపుతున్నారని వినోద్ కుమార్ కొంకన్ బృందానికి తెలిపారు. రాష్ట్రంలో భద్రాచలం ఐ టీ సి, కాగజ్ నగర్ లోని జె కె పేపర్ మిల్లు, వరంగల్ జిల్లా కమలాపూర్ లోని బిల్ట్ పరిశ్రమలో కొత్త యంత్రాలతో ఉత్పత్తి ని పెంచడంతోపాటు బ్యాంబు ఆధారిత మరిన్ని పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వారికి వివరించారు. బ్యాంబును పలుచగా బద్దలుగా చీల్చి, వాటిని ప్రెస్సింగ్ చేసి కలపగా రూపొందించి వాటితో ఫర్నిచర్, డోర్స్, విండోస్, ఫ్లోరింగ్ తదితర వస్తువులు తయారు చేసేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించనున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ లోక వెంకట్రాంరెడ్డి , డిప్యూటీ డైరెక్టర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.