రేపే సూర్యగ్రహణం.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఈఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం ఏర్పడబోతోంది. సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి..గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు.శ్రీకాళహస్తి ఆలయం మినహా సూర్యగ్రహణంతో ఆలయాలన్నీ మూసివేస్తారు. డిసెంబర్‌ 26న సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా 13 గంటల పాటుగా తలుపులు మూసివేయనున్నారు. తెలంగాణలో ముఖ్య ఆలయాలు కూడా మూసివేస్తారు.పాక్షిక సూర్యగ్రహణం గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు ఏర్పడనుంది. ఈ కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి నుంచి మూసివేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


పాతగుట్ట ఆలయాన్ని సైతం మూసివేస్తామని ఆమె పేర్కొన్నారు.బుధవారం సాయంకాలం భక్తుల మొక్కుసేవలు, దర్బార్‌సేవ, అర్చనలు యధావిధిగా ఉంటాయని ఆమె తెలిపారు.ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, మహానివేదన చేస్తారు. అనంతరం భక్తులను అనుమతిస్తారు.సూర్య గ్రహణం సందర్భంగా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని మూసివేయనున్నట్టు ఈవో దంతులూరి పెద్దిరాజు తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తామని పెద్దిరాజు వెల్లడించారు. గ్రహణ సమయంలో ఉపవాసం, అహార పదార్ధాలపై దర్భలు వేయడం ఆచరిస్తుంటాం.

వీటి వెనుక అనేక రహస్యాలు కనిపిస్తాయి. సూర్య గ్రహణ సమయంలో ఏర్పడే అతినీలలోహిత కిరణాలు వ్యక్తులపై ప్రభావం చూపుతాయి. అతినీలలోహిత కిరణాలను శోషం చేసుకునే గుణం కలిగిన దర్భలకారణంగా మన శరీరంపై నెగిటివ్ ప్రభావం పడదు. గ్రహణం రోజున ఆరు గంటల ముందే ఆహారం తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.

విక్రం సారాభాయ్ రిసెర్చ్ సెంటర్ పరిశోధనలో సూర్యకిరణాల ప్రభావం వల్ల వచ్చే రసాయనిక చర్యలను నిరూపించారు. గ్రహణం వల్ల జీర్ణవ్యవస్థ డిస్ట్రబ్ అవుతుంది.గ్రహణ సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే హోమం చేసినంత ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. ఏ గ్రహణాన్నైనా నేరుగా చూడటం వల్ల కంటిలోని సున్నితమైన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుంది. ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా గ్రహణాన్ని చూడటం మంచిదికాదు. గ్రహణం సమయంలో  పాటించే నియమాలను కొట్టిపారేయకూడదు