శీతాకాలం..మంచు కురిసే వేళలు, జివ్వు మనిపించే చల్లని పిల్ల గాలులు. కంటికిఅందంగా కనిపించే ప్రకృతి సోయగాలు. అంతవరకు బాగానే ఉంది. ఈ కాలంరోగాలకు కూడా నిలయమే. కాస్త ఏమరుపాటుగా ఉన్నా, అనారోగ్యానికి గురికావాల్సిందే. ఉన్నఫళంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీంతో చలితీవ్రత పెరిగింది. ఫలితంగా శరీరంలోని ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.ఈ వ్యత్యాసాల కారణంగా ప్రధానంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ శీతాకాలంలో బాలలఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిఉంది. అందుకు సంబంధించి'సాక్షి' అందిస్తున్న ప్రత్యేక కథనం.
కడప రూరల్: ఇటీవల వాతావరణం విచిత్రంగా మారుతోంది. మొన్నటి వరకు వర్షాలు కురిశాయి. అంతలోనే వేసవిని తలపించేలా ఎండలు కాశాయి. ఇప్పుడు ఉన్న ఫళంగా చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనిష్టం 19, గరిష్టం 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో చలి తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
ఈ శీతాకాలంలో చల్లని వాతావరణం చిన్నారుల శరీరంలోని ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా శరీరంలో 36.5 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉండాలి. ఈ చలి కాలంలో ఆ ఉష్ణోగ్రతలు తగ్గు ముఖ పట్టేంందుకు ఆస్కారం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టినప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఈ ప్రభావం చంటి బిడ్డలపై పడుతుంది.