• పల్లె ప్రగతి.. గ్రామ సర్పంచ్ లు చరిత్రలో నిలిచిపోయేందుకు వచ్చిన అవకాశం
• అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు..పల్లెలు అందంగా, పచ్చగా ఉండడం
• మీమీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సర్పంచ్ ల బాధ్యత పల్ల ప్రగతికి పాటుపడడం
• పల్లె ప్రగతిని ప్రజా ప్రతినిధులంతా సద్వినియోగం చేసుకోవాలి
• వేరే కార్యక్రమాలకు బడ్జెట్ లో కోత విధించినా పల్లె ప్రగతికి నెలకు 339 కోట్ల రూపాయలను సిఎం కేసిఆర్ గారు క్రమం తప్పకుండా ఇవ్వడమే దీని ప్రాముఖ్యతకు నిదర్శనం
• మీ గ్రామ శివార్లలో ఉన్న హాస్టళ్లు, ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలి
• దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్ వాడీలను రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తోంది
• కేంద్రం 20 శాతం నిధులిస్తే...రాష్ట్రం 80 శాతం నిధులిచ్చి మహిళలు, శిశువుల సంక్షేమ కేంద్రాలుగా మార్చింది
• ప్రతి రోజు గుడ్డు, గ్లాసు పాలు, అక్కడే వండి ఒక పూట భోజనం పెడుతున్న కేంద్రాలు అంగన్ వాడీలు
• బడికి వెళ్లే వరకు పిల్లల బాగోగులు, ప్లేస్కూల్ నిర్వహణ అంగన్ వాడీలు చేస్తున్నాయి
• వరంగల్ పల్లె ప్రగతి సన్నాహక సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
వరంగల్ అర్భన్, డిసెంబర్ 29 చాటింపు ప్రతినిది: దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన మేరకు మన రాష్ట్రంలో చేపడుతున్న పల్లె ప్రగతి గ్రామ సర్పంచ్ లు చరిత్రలో నిలిచిపోయేందుకు వచ్చిన గొప్ప అవకాశమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్ అర్భన్ జిల్లాలోని విష్ణుప్రియ గార్డెన్స్ లో నేడు ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి సమావేశంలో ఆమె ప్రసంగించారు.
పల్లెలు అభివృద్ధి చెందడం అంటే భవనాలు కట్టడం, రోడ్లు వేయడమే కాదు...పల్లెలు పచ్చగా ఉండడం, అందంగా ఉండడం అని గుర్తించిన సిఎం కేసిఆర్ నేడు పల్లెలకు అన్ని వసతులు ఉండేలా నెలకు 339 కోట్ల రూపాయలనిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. బడ్జెట్లో అనేక కార్యక్రమాలకు నిధుల కోత విధించినా పల్లె ప్రగతికి మాత్రం నెలనెల 339 కోట్ల రూపాయలు విడుదల చేయడం ఈ కార్యక్రమానికి సిఎం కేసిఆర్ ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనమన్నారు.
గతంలో గ్రామానికి వచ్చే నిధులన్నీ బోర్లు వేయడానికి, నీళ్లు ఇవ్వడానికే ఎక్కువగా ఖర్చు అయ్యేవని, ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల గ్రామంలో నీటి సమస్య తీరిపోయిందన్నారు. పల్లె ప్రగతి ద్వారా వచ్చే నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామ ప్రజా ప్రతినిధులుగా గ్రామాలలో, గ్రామ శివార్లలో ఉండే ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను పట్టించుకోవాలని కోరారు.
ముఖ్యంగా అంగన్ వాడీలపై గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ అంగన్ వాడీలను స్త్రీ, శిశు సంక్షేమ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. కేంద్రం 20 శాతం నిధులిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం నిధులిచ్చి వీటిని నిర్వహిస్తోందన్నారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలకు కావల్సిన పోషకాహారాన్ని ప్రతి రోజు గుడ్డు, గ్లాసు పాలు, మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా సమకూర్చుతోందన్నారు. చిన్న పిల్లలు బడికి వెళ్లే వరకు వారి బాగోగులు చూసుకుంటూ, ప్లేస్కూల్ నిర్వహిస్తోందన్నారు.
గర్భిణీ స్త్రీలకు ఆరు నెలలు వచ్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మూడు నెలల వరకు నెలకు 2000 రూపాయల చొప్పున 12వేల రూపాయలు ఇస్తూ తల్లీ, బిడ్డల ఆరోగ్య సంరక్షణకు సిఎం కేసిఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, పల్లె ప్రగతి వల్ల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అవార్డు తీసుకోవడం అభినందనీయమన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి నిర్వహణలో వరంగల్ అర్భన్ జిల్లా మూడో స్థానంలో ఉన్నందుకు కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.
గత 30 ఏళ్లుగా తాను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లా రాజకీయాల్లో ఉన్నానని, దైవ సమానులైన ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీర్వాదంతో నేడు గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతూ ఇక్కడి నాయకుల సహకారంతో ఈ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతు సమన్వయ సమితి చైర్మన్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ శ్రీ బండ ప్రకాశ్, శాసనమండలి చీఫ్ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీ అరూరి రమేష్, శ్రీ చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.