టీఆర్ఎస్ పార్టీ పరిశీలకుల తీరు పట్ల ఓటర్ల అసంతృప్తి

 


చాటింపు ప్రతినిధి సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ :  రాబోయే పురపాలిక ఎన్నికల్లో    సూర్యాపేట మున్సిపల్ పరిధిలో గల 48 వార్డుల్లో కౌన్సిల్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గాను టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన పరిశీలకుల తీరు పట్ల వార్డుల్లోని ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసి పేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ ఖాతాలో వేసుకునేందుకు పక్కా వ్యూహరచన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి సంకల్పాన్ని పరిశీలకులు పక్కదారి పట్టిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓటర్ల మనోగతాన్ని వ్యక్తిగతంగా సేకరించాల్సిన పరిశీలకులు సంబంధిత వార్డులోగల కౌన్సిలర్ అభ్యర్థిత్వ ఆశావాహులను స్వయంగా వెంట తిప్పుకుని ఓటర్ల దగ్గరకు వెళ్లి వారి మనోగతాన్ని తెలుసుకునే విధానాన్ని ఓటర్లు అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది.  కాగా వార్డుల్లో సరిహద్దులను గుర్తించడానికి పోటీ చేసే అభ్యర్థులను వెంట తిప్పుకుంటున్నామని పరిశీలకులు చెప్పడాన్ని ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు  ఈ విధానంతో పరిశీలకులు చేసిన నివేదికలో గెలిచే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పార్టీలో కొందరు చర్చించుకోవడం గమనార్హం.  వార్డులో ఎవరికి  ప్రజాదరణ ఎక్కువగా ఉంది అనే  విషయం  తెలుసుకునేందుకు, వార్డు సరిహద్దులను గుర్తించ డానికి  పరిశీలకులు వార్డు లోని ఓటర్ల సహకారం తీసుకుంటే అభ్యర్థుల గెలుపుపై నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నివేదికల ఆధారంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని పార్టీలో కొందరు అనుకుంటున్నారు.