గతేడాదితో పోలిస్తే క్రైం రేట్ తగ్గింది: నగర సీ పీ అంజనీ కుమార్.
హైదరాబాద్: నేరపరిశోధనలో సీసీ టీవీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ ఏడాది సీసీటీవీల ద్వారా 4216 కేసులు పరిష్కరించామన్నారు. గత ఏడాదితో పోలిస్తే 3శాతం వరకు క్రైం రేట్ తగ్గిందన్నారు. తీవ్రమైన నేరాలు 9శాతం, చైన్ స్నాచింగ్ ఘటనలు 30శాతమన్నారు. ప్రాపర్టీ నేరాలు 2 శాతం తగ్గాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రాపర్టీ క్రైమ్‌లో రికవరీ శాతం 61శాతానికి పెరిగిందన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించగలిగామన్నారు. ఈ-చలాన్ విధానం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు శిక్షణ ఇచ్చామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. 1,843 లీటర్ల లిక్కర్, మద్యాన్ని సీజ్ చేశామని.. గంజాయి 40 కిలోలు సీజ్ అయ్యిందని సీపీ తెలిపారు. అలాగే 3,286 గ్రాముల బంగారం సీజ్ చేశామని.. ఈ ఏడాది మాదక ద్రవ్యాల కేసులు 88 నమోదు అయ్యాయన్నారు. ఇందులో 493 కిలోల గంజాయి, కొకైన్ 25 గ్రాములు, హెరాయిన్ 28 గ్రాములు, ఓపీఎం 4 గ్రాములు, ఎండీఎంఏ 1 గ్రాము, కేటామయిన్ 600 గ్రాములను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. డ్రగ్స్ కేసులో 196 మందిని అరెస్ట్ చేశామని.. వీరిలో ఒకరు విదేశీయులు అని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.