అమీన్ పీర్ దర్గా దేశవ్యాప్తంగా  ప్రసిద్ధి చెందింది:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా
* కడప నగరంలో వెలసిన అమీన్ పీర్ దర్గా

* జనవరి మాసంలో జరుగు అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను మునుపటికంటే ముందస్తు ప్రణాళికతో  ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలి.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా.

 

కడప, డిసెంబరు, 26:- 2020 జనవరి మాసంలో జరుగనున్న అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా అన్నారు. గురువారం స్థానిక అమీన్   పీర్ దర్గా లోని ముషాయిరా హాల్ నందు అమీన్ పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై  అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు .  ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా మాట్లాడుతూ కడప నగరంలోని అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు జనవరి మాసంలో జరగనున్నాయని అందుకు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాటు చేసి ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. అందుకోసం అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) సభ్యులు మరియు జిల్లా యంత్రాంగం సమన్వయ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేయాలన్నారు. అమీన్ పీర్ దర్గా కేవలం ముస్లింలకే కాకుండా అన్ని మతాలు, కులాలు వారు ఒక భక్తి భావనతో ప్రతి ఒక్కరూ సందర్శించడం జరుగుతుందన్నారు. గురు శుక్రవారాలలో గమనిస్తే   ముస్లింల కంటే ఇతర మతాలవారు ఎక్కువ సంఖ్యలో  భక్తి తో సందర్శించడం జరుగుతుందన్నారు. జనవరి మాసంలో జరగనున్న ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా అందరూ భాగస్వాములై ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. కడప జిల్లాలో ఉరుసు ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ దర్గా జిల్లావ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని, దేశంలోనే ప్రసిద్ధిగాంచిన దర్గా లలో కడప అమీన్ పీర్ దర్గా ఒకటన్నారు. కేవలం జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు రావడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వ సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని  ప్రస్తుతం కూడా ఈ అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కూడా భాగస్వామ్యం అయ్యేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందన్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కూడా దర్గా పై అమితమైన గౌరవం, ప్రేమ , అభిమానం ఉందని అన్నారు. తన సుదీర్ఘ పాదయాత్ర అనంతరం అమీన్ పీర్ దర్గాను దర్శించుకోవడం, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారానికి  ముందు కూడా దర్శించుకుని ఆశీర్వాదాలు  తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలాంటి లోటుపాట్ల కు తావివ్వకుండా    ఘనంగా నిర్వహించడానికి సహకరిస్తూ  ఉంటామని అన్నారు. అమీన్ పీర్ దర్గా ఉత్సవాలలో ప్రభుత్వం తరఫున దర్గాకు చాదర్ సమర్పణ కు కలెక్టర్ తో పాటు తాను కూడా పాల్గొనడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను పోలీస్ శాఖ మరియు కడప మున్సిపల్ కార్పొరేషన్ వారి సేవలు కీలకమైనవని వారి అవసరం ఎంతో ఉందని అన్నారు. పోలీసు శాఖ భద్రత కొరకు అనేక రకాలుగా ఏర్పాట్లు చేయుటకు కడప డీఎస్పీకి జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ పరిశుభ్రతను పెంచడానికి  పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 13వ తేదీన అమీన్ పీర్ దర్గా ఖుషి ఉత్సవాలలో భాగంగా మెరవని ఉంటుందని ఈ మెరవని రాత్రి పది గంటల నుండి నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకూ కొనసాగుతుందని ఆ సమయంలో యువత  బైక్ రైడింగ్  వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మెరవణి జరుగు దారిలో భక్తులకు ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని అన్నారు అందరి అధికారుల సహాయసహకారాలతో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు. కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ దర్గా ఉరుసు ఉత్సవాలు గతంలో కంటే ఘనంగా నిర్వహించేందుకు అమీన్ పీర్ దర్గా నిర్వాహకులు జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలన్నారు. ఈ దర్గా ఉత్సవాలను దేశమంతా విస్తరించే విధంగా చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ మాట్లాడుతూ

జనవరి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు జరుగుతాయని ఆ ఉత్సవాలను సమన్వయంతో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు. ఇందులో పోలీస్ , మున్సిపల్ కార్పొరేషన్, వైద్య ఆరోగ్య , విద్యుత్, మైనార్టీ, విద్య, ఆర్టీసీ రెవిన్యూ తదితర శాఖ లన్నియు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను  చేయాలని ఎక్కడ ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా అధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలని, పురుషులకు స్త్రీలకు వేరువేరుగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తాగునీరు ఏర్పాటు చేయాలని, హై మాస్ లైట్లను చేయాలన్నారు. నగరంలో ఉరుసు ఉత్సవాలు జరుగుతున్న ప్రధాన రహదారుల్లో ఆర్చీలు ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 108, అంబులెన్స్ తదితర వాహనాలతో పాటు మందులు కూడా ఉండాలన్నారు. విద్యుత్ శాఖ ద్వారా ఉత్సవాల సమయంలో అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అగ్నిమాపక శాఖ వారు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అందరు జిల్లా అధికారులకు రాష్ట్ర అఫీషియల్ కు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ లకు, మీడియా మరియు ఇతర ప్రముఖులకు ఆహ్వానం తెలపాలన్నారు. ప్రభుత్వం తరఫున అమీన్ పీర్ దర్గా కు సమర్పించు చాదర్ ఏర్పాట్లను చేయాలన్నారు. అందరి అధికారులను సమన్వయం చేసుకొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆర్టీసీ ద్వారా బస్సులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ఉత్సవాలకు రానున్న భక్తులకు బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.

జిల్లా ఎస్పీ అంబురాజన్ మాట్లాడుతూ అమీన్ పీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని, నిర్దేశించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇతర జిల్లాల నుండి కూడా భద్రతా సిబ్బందిని పిలిపించుకోవడం జరుగుతుందని అన్నారు.

అనంతరం అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు గోడ పత్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరి కిరణ్, అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి  జనాబ్ ఆరిఫ్ ఉల్లా హుసేని, దర్గా నిర్వాహకులు అమీర్, నయీమ్, జిల్లా అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.