జర్నలిస్టులు ఒత్తిడిని జయించాలి:మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

 
హైదరాబాద్ డిసెంబర్ 27 చాటింపు ప్రతినిధి:
 నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే జర్నలిస్టులు మానసిక, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సూచించారు.  శుక్రవారంనాడు మాసబ్ ట్యాంక్ లో గల మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 34 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున, ప్రమాదాలు/తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆరుగురు వర్కింగ్ జర్నలిస్టులకు యాభై వేల రూపాయల చొప్పున మొత్తం 37 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా గత మూడు ఆర్థిక సంవత్సరాలలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 34 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 224 కుటుంబాలకు లక్ష రూపాయల వంతున 2 కోట్ల 24 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశామన్నారు. ఇప్పుడు మరో 37 లక్షల చెక్కులు అందజేస్తున్నామని, అంతా కలిసి 2017 నుంచి ఇప్పటి వరకు జర్నలిస్టుల కుటుంబాలకు 5 కోట్ల రూపాయల నిధులు అందజేశామని అన్నారు. మరణించిన ఆయా జర్నలిస్టు కుటుంబాలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ను అయిదేళ్లపాటు అందిస్తున్నామని అన్నారు. అట్లాగే ఆయా కుటుంబాలలోని ఒకటి నుండి 10వ తరగతి వరకు చదివే 144 మంది విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును చెల్లిస్తున్నామన్నారు. తీవ్ర అనారోగ్య కారణాల వల్ల పని చేయలేని స్థితిలో ఉన్న 83 మంది జర్నలిస్టులకు యాభై వేల రూపాయలను వర్కింగ్ జర్నలిస్టులకు అందజేశామన్నారు. తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల మరణాల సంఖ్య అత్యధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే మరణించడం విశాదకరమని అన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన జర్నలిస్టులకు కార్మిక శాఖ తరుఫున 5 లక్షల ప్రమాద భీమా ఉందని,  ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులు              ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎస్. విజయ్ గోపాల్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, అకౌంట్స్ ఆఫీసర్ కె.యాదగిరి, మేనేజర్  లక్ష్మణ్ కుమార్, టీయూడబ్ల్యూజె కోశాధికారి మారుతి సాగర్, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, రమణ కుమార్, టీయూడబ్ల్యూజె రాష్ట్ర నాయకులు అవ్వారి భాస్కర్, టీపిజెఎ అధ్యక్షులు భాస్కర్, వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షులు ప్రకాశ్, కార్యదర్శి నాగరాజు, హెయూజె అధ్యక్షులు ఇ.చంద్రశేఖర్, బిజిగిరి శ్రీనివాస్, గోవర్థన్ గౌడ్, జయశంకర్, యాతాకుల అశోక్, శివాజి, తదితరులు పాల్గొన్నారు.